ప్రయాణికులను తనవైపు తిప్పుకొనే క్రమలో ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త చర్యలు తీసుకొంటోంది. ఇందులో భాగంగా మహా శివరాత్రి సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు.. ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో అత్యధికంగా కోటప్ప కొండకు 675, శ్రీశైలానికి 650, కడప జిల్లా పొలతలకు 200, పట్టిసీమకు 100 బస్సులు ఏర్పాటు చేసినట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేశారు. 101 శైవక్షేత్రాలకు 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు.
అటు శైవక్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వివరించారు. ఘాట్‌రోడ్లపై నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సుల నడిపించనున్నట్లు స్పష్టం చేశారు. తూర్పుకనుముల్లోని మహేంద్రగిరి పర్వతాల్లో జరిగే శివరాత్రి మహాయాత్రకు.. పలాస నుంచి సుమారు 25 వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారి శ్రీనివాసరావు చెప్పారు. సాబకోట, సింగుపురం గ్రామాలవద్ద నడకయాత్ర భక్తుల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించనున్నారు. ఉచిత వైద్యశిబిరాలు, 108 వాహనాలను సిద్ధం చేశారు.