మరోసారి ఏపీ కేబినేట్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ పదవుల జాతర మొదలైంది. వీటి కోసం వైఎస్సార్సీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహుల జాబితా చాలా పెద్దగా ఉంది. మార్చి 24వ తేదీ వరకు 14 స్థానాలు, మే ఒకటో తేదీకి 7.. మొత్తంగా 21 మంది ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కానుంది. ఇటు గవర్నర్ కోటాలో నియమితులైన మరో ఇద్దరి పదవీకాలం జులై 20తో ముగియనుంది. పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఖాళీలు అవుతుండడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో కీలక విషయం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కారిడార్‌లో చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 23 స్థానాలు దాదాపు అధికార పార్టీకే దక్కే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉన్నాయి. అయితే.. కొత్తగా ఎమ్మెల్సీ అయ్యేవారికి YS Jagan Mohan Reddy గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈసారి ఎమ్మెల్సీలు అయ్యేవారిలో ముగ్గురు లేదా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ మరింత పెరిగింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఒకరిని ఎమ్మెల్సీ చేసి.. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న వారిలో ఒకరికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.
పార్టీ స్థాపించినప్పటి నుంచి చాలామంది నేతలు జగన్ వెంట నడిచారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఆయన్ను వీడలేదు. వారిలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. మరికొందరు నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. ఇంకా కొందరు పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. అయినా.. ఇంకా కొందరికి ఎలాంటి పదవులు దక్కలేదు. అలాంటి వారిని గుర్తించి.. అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని ఎమ్మెల్సీలు చేసి.. వారిలో ఓ ముగ్గురిని లేదు నలుగురిని మంత్రులుగా చేసే అవకాశం ఉంది.
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ నిత్యం ఆరా తీస్తున్నారు. సమావేశాలు పెట్టి అలెర్ట్ చేస్తున్నారు. కానీ.. కొందరు మాత్రం మారడం లేదు. ప్రస్తుతం కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉండగా.. కొందరి శాఖల పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. వారి స్థానంలో ఎమ్మెల్సీలు కాబోయే వారిని నియమిస్తారని సమాచారం. జగన్ మొదటి కేబినెట్‌లో మండలి నుంచి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రులుగా ఉండేవారు. కానీ.. వారిని రాజ్యసభకు పంపారు. దీంతో మండలి నుంచి మంత్రులు లేరు. దీంతో ఇప్పుడు కొత్తగా మండలికి వచ్చేవారిలో కొందరికి మంత్రి పదవులు రానున్నాయి.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను కూడా జగన్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సామాజికవర్గాల సమీకరణాలు కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తర్వాత కూడా సామాజికవర్గాల సమీకరణాల ఆధారంగానే మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కొదరు నేతలు డబుల్ గుడ్‌న్యూస్ వినే అవకాశం ఉందని పొలిటికల్ కారిడార్‌లో టాక్ నడుస్తోంది. ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలి మరి.