ఎన్ని కేసులు పెట్టినా ఈ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తేల్చిచెప్పారు. తన అనుచరులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని చెప్పారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడే సమస్యే లేదని స్పష్టం చేశారు. తన అనుచరులైన వైసీపీ నెల్లూరు అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావుతో పాటు రఘు, జావేద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఆదేశాల మేరకే ఈ అరెస్టులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని అంశాలు వదిలిపెట్టి నెల్లూరు రూరల్‌పైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు.
తమ అనుచరుల అరెస్టులపై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు. తాను వేదాయపాలెం స్టేషన్‌కు వెళ్తే.. అక్కడ వెంకటేశ్వరరావు లేకపోవడంతో పోలీసులను నిలదీశానని.. దీంతో 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశ పెడతామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించానని తెలిపారు. ఏదేమైనా తన అనుచరులను అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని కోటంరెడ్డి విమర్శించారు. తనను మానసికంగా వేధించాలని చూస్తున్నారని.. కానీ, తన అనుచరులు ఎవరూ భయపడరని, చివరికి తన డ్రైవర్ కూడా పట్టించుకోడని వ్యాఖ్యానించారు. ఇలాంటి బెదిరింపులను విద్యార్థి దశలోనే అన్నీ చూశానని కోటంరెడ్డి తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా భయభ్రాంతులు గురిచేసే రీతిలో అరెస్టులు చేయడం సరికాదని హితవు పలికారు. 4 నెలల క్రితం జరిగిన ఘటనలో తనతో పాటు 11 మందిపై కేసు నమోదు చేశారని.. అప్పుటి కేసులో ఇప్పుడు కేసు ఎందుకని ఎమ్మెల్యే కోటంరెడ్డి నిలదీశారు. ఇదంతా ఎందుకు.. తనను కూడా అరెస్ట్ చేస్తే, న్యాయ పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు.