ఏపీ క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ , ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. శుక్రవారం రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన.. 10 గంటల వరకు పార్టీ నాయకులతో కలిసి కొద్దిసేపు గడిపారు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. తర్వాత గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సర్రాజు మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపాన్ని తెలిపారు.
పాతపాటి సర్రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. ఆయన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2009 ఎన్నికల్లో మళ్లీ ఉండి నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగగా ఓటమి ఎదురైంది. 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరి.. మళ్లీ ఉండి నుంచి పోటీ చేయగా ఓడిపోయారు. 2019లో వైఎస్సార్‌సీపీ టికెట్ దక్కలేదు.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పదవిని అప్పగించారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా కూడా సర్రాజు ఉన్నారు.