బీజేపీ తన ప్రత్యర్థులపై రాజకీయ వేట ప్రారంభించిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. మేయర్ ఎన్నికపై సుప్రీం కోర్టులో బీజేపీ కేసు ఓడిపోయిన మరుసటి రోజే తనకు సీబీఐ నోటీసులు అందాయని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రోద్బలంతోనే ఈ నోటీసులు జారీ అయ్యాయని ఆరోపించారు. ‘‘బీజేపీ తన రాజకీయాలు చేసుకోవచ్చు. అయితే.. సీబీఐ అధికారులు నా అభ్యర్ధనను మన్నిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది.’’ అని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా తాను అరెస్టులకు భయపడని తాజాగా మీడియాతో వ్యాఖ్యానించారు. ఏ ప్రశ్నల నుంచీ తప్పించుకునేందుకు ప్రయత్నించట్లేదని స్పష్టం చేశారు. మద్యం పాలసీ స్కాంకు సంబంధించి మనీశ్ సిసోడియాను ప్రశ్నించేందుకు సీబీఐ శనివారం నోటీసులు జారీ చేసింది. అయితే.. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరి కొంత సమయం కావాలని మనీశ్ సిసోడియా కోరారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో తలమునకలై ఉన్నానని వివరించారు. ‘‘నాకు నిన్న సీబీఐ నోటీసులు అందాయి. ప్రస్తుతం నేను ఢిల్లీ బడ్జెట్‌పై రేయింబవళ్లు పనిచేస్తున్నాను. ఈ సమయంలో నాకు ప్రతి రోజూ కీలకమే.’’ అని మనీశ్ మీడియాతో వ్యాఖ్యానించారు.