కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల మధ్య వార్ కొనసాగుతోంది. మహిళా ఐఏఎస్, ఐపీఎస్‌లు సోషల్ మీడియా క్షిగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం గమనార్హం. ఫేస్‌బుక్‌లో ఐఏఎస్ రోహిణి సింధూరిని విమర్శిస్తూ ఐపీఎస్ రూపా మౌఢ్గిల్ ఆదివారం పలు పోస్ట్‌లు చేశారు. రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి రూపా... ఐఏఎస్ పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. రూపా ప్రస్తుతం హోంగార్డ్స్ ఐజీగా ఉండగా.. రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌గా ఉన్నారు.
గతేడాది మైసూరు కలెక్టర్‌గా ఉన్న రోహిణి సింధూరిని తన బదిలీని క్యాట్‌లో సవాల్ చేయగా... ఆమె తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదించి సహకరించారని, కన్నడిగులైన తమలాంటి వారికి ఎందుకు ఇటువంటి వెసులుబాటు ఇవ్వలేదని రూపా ప్రశ్నించారు. ఈ మేరకు ఫేస్‌బుక్ ఖాతాలో పలు ఫోటోలను, సుదీర్ఘమైన వాదనలను పోస్ట్ చేశారు. మూడేళ్ల కిందట యాదగిరి నుంచి బెంగళూరుకు బదిలీ అయినప్పుడు మరో అధికారి క్యాట్‌లో కేసు వేస్తే అప్పుడు నా తరఫున ఏజీ ఎందుకు వాదించలేదు ఆమె నిలదీశారు. వ్యక్తిగత ఫొటోలను ఇతర ఐఏఎస్‌లకు రోహిణి పంపించారని, ఇది సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించడమేనని పేర్కొంటూ అనేక ఆరోపణలను రూపా గుప్పించారు.
ఎమ్మెల్యే సారా మహేశ్‌తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రూప ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో మైసూర్ కలెక్టర్‌గా ఉన్న రోహిణి.. విలాసవంతమైన స్విమ్మింగ్ ఫూల్ నిర్మించుకున్నారని ఆరోపించారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మిస్తున్నారంటూ ఏకకంగా 19 రకాల ఆరోపణలతో కూడిన ఓ జాబితాను రూపా విడుదల చేశారు.
రూపా తనను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత ఆరోపణలపై రోహిణి సింధూరి ఘాటుగా స్పందించారు. నా ప్రైవేటు పోటోలు విడుదల చేయడంపై న్యాయపోరాటం చేస్తానని రోహిణి స్పష్టం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని మండిపడ్డారు. మతి స్థిమితం కోల్పోయిన రూపా మౌఢ్గిల్.. ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక రోగానికి ఆమె చికిత్స తీసుకోవాలని ఎద్దేవా చేశారు.
తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆమెపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. నేను వ్యక్తిగత ఫొటోలను ఎవరికి పంపానో బయటపెట్టాలని, బాధ్యతాయుత స్థానంలో ఉంటూ ఇష్టానుసారం నా ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిందని దుయ్యబట్టారు. కాగా, ఈ వ్యవహారం రాష్ట్ర పాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, తెలంగాణకు చెందిన రోహిణి సింధూరి వ్యవహారం కర్ణాటకలో చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. మొదట్లో చాలా సిన్సియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తీరు తర్వాత వివాదాస్పమయింది. మైసూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో తోటి ఐఎఎస్ అధికారిణి, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్ మధ్య వివాదం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది.
ఇదిలావుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితాశర్మను సోమవారం మధ్యాహ్నం కలుసుకున్న రోహిణి.. తనపై రూప చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. రోహిణి ఫోన్‌తో పాటు తనదీ హ్యాక్ అయ్యిందంటూ ఆమె భర్త సుధీర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.