సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంగా యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు వీటిని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియోల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. ఇకపై ఉద్యోగులు ఎలాంటి యూట్యూబ్ చానళ్లు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అలా చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఇంటర్నెట్, సోషల్ మీడియాను వినియోగించేందుకు మాత్రమే ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛ పరిమితమని, సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండటం, యూట్యూబ్ చానల్ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందడానికి దానిని ఉపయోగించకూడదని తేల్చి చెప్పింది.
ఒకవేళ అలా ఎవరైనా యూట్యూబ్ చానళ్లను నిర్వహిస్తే కేరళ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి 1960 ప్రకారం ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ చానళ్లను ప్రారంభించేందుకు అనుమతి సాధ్యం కాదని ఉత్తర్వుల్లో వివరించింది. యూట్యూబ్ చానల్ నిర్వహణకు అనుమతి కోరుతూ అగ్నిమాపక సిబ్బంది చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఇప్పటికే యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వాటిని మూసివేయాలని ఆదేశించింది.
ఆఫీసులకు వచ్చిన తర్వాత కూడా పనులను పక్కనబెట్టి ఉద్యోగులు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతుండడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అభిప్రాయాలు, ఆలోచనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మానుకోవాలని 2021లో కర్ణాటక సర్కారు ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫోటోలు, అభ్యంతర పోస్టులను సోషల్ మీడియాలో చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ (డీపీఏఆర్) జారీచేసిన ఉత్తర్వులో తెలిపింది. దీనికి ముందు ప్రభుత్వ పాలనపై మీడియా ముందు అసమ్మతిని వ్యక్తం చేయడం మానుకోవాలని ఓ జీవోను జారీచేసింది.