శ్రీకాకుళం జిల్లాలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం సాయంత్రం కాశీబుగ్గ ఎల్‌సీ గేటు వద్ద చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాశీబుగ్గ నిత్యానందనగర్‌లో పెంట చిన్న రామారావు (65) మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారులు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. రామారావు బ్యాంకులో పనిచేసి పదవీవిరమణ చేశారు. భార్య మాధవి అనారోగ్యానికి గురికావడంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా కిడ్నీ వ్యాధిబారిన పడినట్లు గుర్తించి డయాలసిస్ చేయాలని సూచించారు. దీంతో భార్య అనారోగ్యంతో మృతి చెందితే తాను తట్టుకోలేనని భావించిన రామారావు సోమవారం సాయంత్రం తన బైక్‌పై కాశీబుగ్గ ఎల్‌సి గేటు వద్దకు వచ్చి అక్కడే పార్కింగ్ చేశాడు. రైలుపట్టాల వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాస్కోడిగామా రైలు కింద పడేందుకు ప్రయత్నించాడు. అయితే రైలు వేగానికి ఆయన పట్టాల పక్కన పడిపోయాడు. దీంతో ఆయన కాలువిరిగిపోగా, తలపై తీవ్ర గాయాలయ్యాయి. రైలులో ఉన్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడ్ని 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా.. ప్రథమ చికిత్స చేసి శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.