కేబినెట్ కూర్పు ముఖ్యమంత్రికి ఉండే విచక్షణాధికారం అని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు అందరూ మంత్రి స్థాయి వారే అని.. సామాజిక వర్గాల ఆధారంగా కూర్పు జరుగుతుందని వివరించారు. కొన్ని కులాలకు మంత్రి పదవి ఇవ్వలేదని ఇష్యూ చేస్తున్నారని.. కులాల కూర్పులో ముఖ్యమంత్రికి ఏమైనా ఇబ్బంది ఉంటే రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని అప్పలరాజు ప్రకటించారు. సరైన గౌరవం ఇచ్చారు.. ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు. మత్స్యకారులను చంద్రబాబు బెదిరిస్తే.. జగన్ అక్కున చేర్చుకున్నారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలో ఏ విధంగా సామాజిక న్యాయం జరుగుతుందో.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను చూస్తే స్పష్టమవుతుందని.. మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. 68 శాతం వెనుకబడిన వారే ఎమ్మెల్సీలుగా ఉన్నారని వివరించారు. జగన్ ప్రభుత్వం వడ్డెరలను అణగదొక్కుతోందని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను అప్పలరాజు ఖండించారు. వడ్డెరలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెడుతున్నామని వివరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వల్ల సమాజానికి ప్రమాదమని ఆరోపించారు.
'చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను అంటరాని వారిగానే చూశారు. అలాంటి వారికి ఏ శిక్ష విధించాలి. అసలు చంద్రబాబు రాజకీయాలకు పనికి వస్తారా? ఒక్క బీసీని రాజ్యసభకి కూడా పంపలేదు. పదవులన్నీ చంద్రబాబు అమ్ముకునేవారు. మేము నలుగురు బీసీలను రాజ్యసభకు పంపాం. టీడీపీ నేతలకు ఛాలెంజ్ చేస్తున్నా.. మీ ఆదరణ పథకం వల్ల బాగుపడిన ఒక్క బీసీ కుటుంబాన్ని చూపిండి' అని మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు.
'గన్నవరంలో ఏదో జరిగిపోతోందని గోల చేస్తున్నారు. లోకేష్ నువ్వు పిల్ల బచ్చా. నీ స్థాయి ఏంటి? జగన్ స్థాయి ఏంటి? అన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. మీరు తిడితే.. మేం చేతులు కట్టుక కూర్చోవాలా? ఒక్కొక్కరికి తాట తీసే రోజులు దగ్గర్లో ఉన్నాయి. మేం కన్నెర్ర చేస్తే మీరు నియోజకవర్గాల్లో తిరగగలరా? అల్లరి మూకలను చంద్రబాబు అదుపులో పెట్టాలి. గన్నవరం గొడవలకు చంద్రబాబు కుట్ర చేశారు' అని అప్పలరాజు ఆరోపించారు.