అమరావతిలో భూములకు సంబంధించి సీఐడీ కేసులో నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలకు సంబంధించి నారాయణపై 2020లో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసుపై మంగళవారం విచారించిన హైకోర్టు.. నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 41 ఏ నిబంధనలు అనుసరించాలని సీఐడీ పోలీసులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ నారాయణపై వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు.. విచారణ చేపట్టిన పోలీసులు అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ 1గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఏ 2గా మాజీ మంత్రి నారాయణను చేర్చారు. అప్పటి చంద్రబాబు, నారాయణ న్యాయపోరాటం సాగిస్తున్నారు.