ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత భయం అని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తానంటే సీఎంకు భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. ప్రశాంతంగా సాగుతున్న తన పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. సీఎం జగన్ ఆదేశాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మతకలహాలు, ఘర్షణలు చెలరేగినప్పుడు ఉపయోగించాల్సిన వాహనాన్ని తన పాదయాత్రకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం లోకేష్ ట్వీట్ చేశారు.
‘‘నేనంటే ఎందుకింత భయం జగన్? ఈ సెల్ఫీలో నా వెనుకున్న వాహనం చూశారా? అదేనండి వజ్ర వాహనం. మతకలహాలు, ఘర్షణలు చెలరేగినప్పుడు ఉపయోగిస్తారు కదా! అదే.. ప్రశాంతంగా సాగుతున్న నా పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు జగన్ రెడ్డి ఆదేశాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు.
అంతకుమించి వజ్ర వాహనం అవసరం ఏమొచ్చింది? నేనంటే జగన్ రెడ్డికి భయం. అందుకే అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నా పాదయాత్ర సుబ్బనాయుడు కండ్రిగ గ్రామం చేరింది. నా వెంట పోలీసులు, ఇదిగోండి ఈ వజ్రవాహనం కూడా జగన్ రెడ్డి గారు పంపారు. ఇవి చూశాక మీరే చెప్పండి నేనంటే జగన్‌కి ఎందుకింత భయం?’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే నందమూరి తారకరత్న అకాల మరణం నేపథ్యంలో నారా లోకేష్ రెండు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తారకరత్న అంత్యక్రియలు సోమవారం ముగియడంతో మంగళవారం నుంచి లోకేష్ తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. అయితే, తన పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మొదటి నుంచి లోకేష్ ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే తన పాదయాత్రకు విఘాతం కలిగించేందుకు ఈ సారి సీఎం జగన్మోహన్ రెడ్డి వజ్ర వాహనాన్ని పంపించారని ఆరోపించారు.
మరోవైపు తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తిలో మైనారిటీలతో నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మైనారిటీల్లో పేదరికం ఎక్కువగా ఉందని.. ఎన్టీఆర్ ఆనాడే గుర్తించి మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మైనారిటీ కార్పొరేషన్ కొనసాగింది.. కానీ జగన్ రెడ్డి వచ్చాక తీసేశారని పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంట్‌లో మహిళలకు రెసిరెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. పాదయాత్రలో జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని.. కానీ, అమలు చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. తాము పప్పుబెల్లాలు ఇచ్చే చేతులు దులుపుకునే వాళ్లం కాదన్నారు. మైనారిటీ సోదరులకు ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ క్లస్టర్‌లో స్థానం కల్పించి, మీరే ఉద్యోగాలు కల్పించేలా విధానాలు రూపొందిస్తామని పేర్కొన్నారు.