శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, ఆ తర్వాత జరిగిన ఘటనలపై ఆయన ఇలా రియాక్ట్ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం నుంచి జరిగిన ఘటనల నేపథ్యంలో టీడీపీ తలపెట్టిన చలో గన్నవరం.. కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
'సోమవారం గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో.. విధులు నిర్వహిస్తున్న గన్నవరం సీఐ కనకరావు తలకు గాయమైంది. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి దృశ్యాలను పరిశీలిస్తున్నాం. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. గన్నవరం పీఎస్ పరిధిలో 144 సెక్షన్ విధించాం. ముందస్తు అనుమతి లేకుండా సభలు, నిరసన కార్యక్రమాలలు చేపట్టొద్దు' అని ఎస్పీ జాషువా స్పష్టం చేశారు.
గన్నవరంలో జరిగిన ఘటన ఇటు విజయవాడలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. వల్లభనేని వంశీ, కొడాలి నానిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భయంతోనే కొడాలి నాని, వంశీ వైసీపీలోకి వెళ్లారని బుద్దా వెంకన్న ఆరోపించారు. తెలుగుదేశం కార్యాలయంపై దాడికి నిరసనగా గన్నవరం వెళ్లేందుకు సిద్ధమైన బుద్దా వెంకన్నను.. విజయవాడలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన బయటికి రాకుండా పోలీసులు ఇంటి గేటు మూసేశారు. దీనిపై బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు విజయవాడలోని కొమ్మారెడ్డి పట్టాభి ఇంటికి పోలీసులు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గన్నవరం కోర్టుకు ఆయన్ను తీసుకొస్తామని పట్టాభి సతీమణి చందనకి చెప్పారు. అయితే.. పట్టాభితో వీడియో కాల్ మాట్లాడించాలని చందన కోరారు. కానీ.. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో డీజీపీని కలిసేందుకు చందన బయల్దేరారు. బైక్‌పై బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత చందన గన్నవరం వెళ్లే ప్రయత్నం చేశారు.