టీటీడీ శ్రీవారి భక్తులకు శుభవార్తవినిపించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి.. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ కోటాలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి.. మిగతా ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుంచి.. ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈ లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు ఫీజు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాలను గమనించి ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అటు తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి ఒకటి నుంచి.. ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా నివారించడానికి.. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద.. కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద దీన్ని వినియోగించనున్నారు.