పోలీసులు తనను కొట్టారంటూ టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ఇదిలావుంటే గన్నవరం రాజకీయం గంట గంటకూ గరం గరంగా మారుతోంది. సోమవారం అక్కడి టీడీపీ ఆఫీస్‌పై దుండగులు దాడి చేయడంతో.. వివాదం చెలరేగింది. అది కాస్త.. టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్‌గా మారింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలుసుకుని.. అక్కడికి వెళ్లిన పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం పట్టాభి సహా 15 మందిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సమయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తనను పోలీసులు కొట్టారంటూ.i దెబ్బలు చూపించారు. కోర్టుకు వెళ్తూ వాచిపోయిన తన చేతులను చూపించారు.
సోమవారం రాత్రి నుంచి పట్టాభి కనిపించకపోవడంపై ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారు. 'టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలిసి నా భర్త గన్నవరం కార్యాలయానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఆయనకు ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత' అని పట్టాభి భార్య స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తన ఇంటి వద్దే దీక్షకు దిగిన పట్టాభి భార్య చందనకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని.. ఢిల్లీలో నూతన గవర్నర్‌ను కలిసి ఇక్కడి పరిస్థితి వివరిస్తాను అని రఘురామరాజు ధైర్యం చెప్పారు.