శ్రీకాళహస్తీశ్వరాలయం దేవస్థానం అధికార్లపై భక్తులు మండిపడ్డారు. ఆలయంలో సింగర్ మంగ్లీ పాట షూటింగ్‌పై వివాదం రాజుకుంది. ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదనే ఆంక్షలు ఉన్నాయి. అయినా.. కాలభైరవ ఆలయం, రాహుకేతు పూజల మండపంలో పాట చిత్రీకరణ జరిపారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగ్లీ పాట చిత్రీకరణపై దేవస్థానం అధికారులు ఏం మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వాయు లింగ క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో.. ఇటీవల మంగ్లీ చిత్రీకరించిన పాట వివాదాస్పదంగా మారింది.
నిబంధనల ప్రకారం.. శ్రీకాళహస్తి ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. వీటిపై ఆలయ అధికారులు, పాలక మండలి ఆంక్షలు విధించారు. కానీ.. వాటిని పక్కన పెట్టి ఆలయ అధికారులే మంగ్లీ పాటల చిత్రీకరణకు అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి.. ఆలయం లోపలికి కెమెరాలు తీసుకుని వెళ్లి పాట చిత్రీకరణ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముక్కంటి ఆలయంలోనే పాటలు చిత్రీకరించారని.. రాహుకేతు సర్ప దోష పూజ మండపంలో, కాళభైరవ ఆలయం ముందు భాగంలో మంగ్లీ పాటను చిత్రీకరించారని తెలుస్తోంది.
అయితే.. ముక్కంటి ఆలయంలో పాట చిత్రీకరణకు అనుమతి ఎవరు ఇచ్చారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. శివరాత్రికి పది రోజుల ముందు పాట చిత్రీకరణ అయినట్టు తెలుస్తోంది. పాట చిత్రీకరణలో శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీఅర్ధగిరిస్వామి, మిగిలిన స్వాములు ఉండడం విశేషం. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఆలయ ఈవో సాగర్ బాబులకు తెలియకుండానే మంగ్లీ బృందం పాట చిత్రీకరణ చేశారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయాన్ని ఆలయ అధికారులు, ఎమ్మెల్యే ఎందుకు గోప్యంగా ఉంచారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. శివ భక్తులు, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అధికారులు ఎందుకు ప్రవర్తించారని ప్రశ్నిస్తున్నారు. అయితే.. దేవదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి పాట చిత్రీకరణకు అనుమతిని తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి జీవో విడుదల చేయగా.. ఆ జీవోను అధికారులు, పాలక మండలి గోప్యంగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.