బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న చీరాల, పర్చూరు అద్దంకి నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చేసింది. చీరాల కు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత పదవిని రెన్యువల్ చేయడం ద్వారా పార్టీ, అధినేత సీఎం జగన్ ఆమెను అసెంబ్లీ రేస్ నుండి తప్పించేశారు. దీంతో చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు, నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబుకు లైన్ క్లియర్ అయిపోయింది.
ఒక దశలో కరణం వారిని అద్దంకి పంపుతారన్న ప్రచారం తారాస్థాయిలో సాగింది. చీరాలలో బీసీ కి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. దీనితో పోతుల సునీత రేసులో ఉంటారని అందరూ భావించారు. ఇందు కోసం ఆమె తనవంతు ప్రయత్నాలు కూడా సాగించిన మాట వాస్తవం. అయితే జగన్ ముందు వెనక ఆలోచించి పోతుల సునీతను ఎమ్మెల్సీ పదవితో సంతృప్తిపరిచి చీరాలలో వెంకటేష్ కు మార్గం సుగమం చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇక చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను ఇప్పటికే పర్చూరు పంపేశారు కాబట్టి అక్కడ ఆయనకు టిక్కెట్ కన్ఫర్మ్ అయిపోయింది. కరణం వారు రావడం లేదు కాబట్టి అద్దంకిలో బాచిన కృష్ణ చైతన్యకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ముగ్గురికి టికెట్లపై స్పష్టత ఇవ్వడం ద్వారా జగన్ వారికి ఇప్పటినుండే గెలుపు మార్గాలు వెతుక్కోవాలన్న సంకేతం ఇచ్చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు