చిట్టి డబ్బులు ఇవ్వని కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా అందుకు కారణమైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ అర్చకుడితో పాటూ భార్యపై కేసు నమోదైంది. తిరుచానూరు ఎస్వీపి కాలనీకి చెందిన నితిన్ సింగ్ స్థానికంగా ప్రొవిజన్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడు తన సొంత అవసరాల కోసం ఇంటి సమీపంలో ఉంటున్న పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు ప్రతాప్ స్వామి భార్య వాణి దగ్గర పెద్ద మొత్తంలో చిట్టీలు వేశాడు. నమ్మకంగా ఉంటారని భావించి డబ్బులు కట్టాడు.
చిట్టి గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నా తనకు రావాలిసిన డబ్బుల్ని దంపతులు ఇవ్వలేదు. అడిగి విసిగి వేసారిన నితిన్ మనస్తాపంతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయేముందు తన చావుకు కారణం చిట్టీ నిర్వహిస్తున్న దంపతులే కారణమని లేఖ రాశాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. ప్రతాప్ స్వామి, వాణిలపై కేసు నమోదు చేశారు. వీరు ప్రస్తతుం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కోట్లాది రూపాయల చిట్టీలు తిరిగి చెల్లించకుండా పారిపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడితో పాటూ భార్యపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.