వైఎస్సార్‌సీపీలో అసంతృప్తి గళాలు కలవరపెడుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని మరో నియోజకవర్గంలో ధిక్కార స్వరం వినిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌పై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఏకంగా టీడీపీకి కోవర్ట్ అంటూ ముద్ర వేశారు.
కొండేపి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వరికూటి అశోక్‌బాబు సొంత పార్టీని నాశనం చేస్తున్నారని అసమ్మతి నేతలు మండిపడ్డారు. అనుచరులతో కలిసి ఇసుక, మద్యం, బియ్యం అక్రమ వ్యాపారాలు చేయిస్తూ దోచుకుంటున్నారని ధ్వమజెత్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్‌బాబు టీడీపీకి కోవర్టుగా పని చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు విమర్శించారు. ఇప్పుడు నిజమైన నేతల్ని, పార్టీ కార్యకర్తల్ని పక్కకు నెట్టి తన మనుషులను ఏజెంట్లుగా పెట్టి అన్ని మండలాల్లో మాఫియా నడుపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇసుక, మద్యం, బియ్యం వ్యాపారాలు చేయిస్తూ మామూళ్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే ఇంఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన్ను అధిష్ఠానం తప్పిస్తుందన్నారు. అలా జరగని పక్షంలో మార్చి నెలాఖరున నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి అశోక్‌బాబు బాధితులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు తాడేపల్లి వరకు పాదయాత్రగా వెళ్లి అశోక్‌బాబును మార్చాలని ఒత్తిడి తెస్తామన్నారు.
టీడీపీ కోవర్టుగా పనిచేస్తున్న అశోక్‌బాబును నియోజకవర్గంలో లేకుండా తరిమికొడతామన్నారు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డపాటి అరుణ. పార్టీ కార్యక్రమాలు తనకు తెలియకుండా మండలంలో నిర్వహిస్తున్నారని జరుగుమల్లి జెడ్పీటీసీ సభ్యురాలు చంద్రలీల ఆరోపించారు. కుటుంబ విషయాల్లో అశోక్‌బాబు జోక్యం చేసుకుంటూ తనను ఇబ్బంది పెడుతున్నారని మరో నేత ఆరోపించారు.
2019 ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే స్వామి గెలుపునకు కృషి చేసింది అశోక్ బాబు కాదా అన్నారు. గత ఎన్నికల్లో పార్టీ అధిష్టానాన్ని బ్లాక్‌మెయిల్ చేయలేదా అన్నారు. టీడీపీ వారి దగ్గర డబ్బులు తీసుకోలేదా.. డబ్బులు తాకే అలవాటు ఆయనకు ఉంది కాని తమకు లేదన్నారు. తాము పార్టీ కోసం కష్టపడుతున్నామని.. మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. 'అశోక్ బాబు నువ్వు నీ ఆరోపణ కట్టుబడి ఉంటే ఏ గుడిలోనైనా లేదా వైఎస్ఆర్ విగ్రహం వద్ద అయినా ప్రమాణం చేయడానికి మేము రెడీ నువ్వు రెడీయా' అంటూ సవాల్ చేశారు.
ఇటీవల కొండేపిలో టీడీపీ ఎమ్మెల్యే స్వామి నిరసన కార్యక్రమం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సందర్భంలో సీఎం జగన్‌ను విమర్శించారని.. అందుకు ప్రతిగా అశోక్‌బాబు ఖండిస్తారని తామంతా ఎదురు చూశామని.. కానీ అలా చేయలేదన్నారు. ఆ తర్వాత జరిగిన గృహసారథుల సమావేశంలో తమను టీడీపీ కోవర్టులని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొత్తం మీద కొండేపి నియోజకవర్గ ఇంఛార్జ్ అశోక్‌బాబును సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారు. అంతేకాదు అశోక్‌బాబుపై పల్నాడు జిల్లా జానపాడుకు చెందిన రైతులు కరపత్రాలు విడుదల చేశారు. తమను మోసం చేశారని ఆరోపించారు.