మైక్ పట్టుకుని మాట్లాడొద్దని జీవో1లో ఉందని.. తన చేతిలో మైకు లేదు.. ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్టూలు పట్టుకుపోతే మరో స్టూలు పట్టుకొస్తామని.. ఎన్ని అడ్డంకులు కల్పించినా తగ్గేదే లేదన్నారు. అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని.. అందరి తరపున పోరాడుతున్నందుకే తన గొంత నొక్కుతున్నారని.. భయం తన బయోడేటాలో లేదన్నారు. తనపై 21 కేసులు పెట్టారని.. అయినా తగ్గేదేలేదన్నారు. అనపర్తిలో చంద్రబాబు సభకి అనుమతి ఇచ్చి మళ్లీ రద్దుచేసి చీకట్లో 7 కిలోమీటర్లు నడిపించారని.. జగన్ పతనం మొదలు అయ్యింది అన్నారు. అందుకే గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఎంత సతాయిస్తే అంత మాట్లాడతాను అన్నారు. సాఫీగా సాగనిస్తే పాదయాత్ర- అడ్డుకుంటే దండయాత్ర అన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి వెళ్లి వంగి కొబ్బరి కాయ కొట్టలేని జగన్ తాను కుర్రాడినంటారని.. 72 ఏళ్ల వయస్సులో 27 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెట్టే చంద్రబాబు గారిని ముసలాడు అనడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీ కార్పొరేషన్లను పునర్నిర్మాణం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లకు కూర్చునేందుకు కార్యాలయం లేదు, కుర్చీలు లేవన్నారు. టీడీపీలో పదవులు అనుభవించిన వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోయి.. తమపై విమర్శలు చేయడం అన్యాయమన్నారు. 22రోజుల క్రితం తన పక్కన కూర్చున్న వ్యక్తి నేడు జగన్ దగ్గరకు వెళ్లారన్నారు. జగన్ తనలా అతన్ని పక్కన కూర్చోబెట్టుకోగలరా అన్నారు. నిన్నటి వరకు తనతో ఉన్న వ్యక్తికి జగన్ వైఎస్సార్‌సీపీ కండువా కప్పి ఎమ్మెల్సీ ఇచ్చారంటే.. జగన్ భయపడుతున్నాడని అర్థమైందన్నారు.
నియోజకవర్గం, పార్లమెంట్ ను ఒక యూనిట్ గా తీసుకుని పదవులు కేటాయిస్తాం.
టీడీపీ అధికారంలోకి వచ్చాక పదవులు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. టీడీపీ హయంలో టీటీడీ చైర్మన్, తుడా చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా బీసీలకే ఇచ్చామని.. ఇంకా బీసీల్లో పేదరికం అధికంగా కనిపిస్తోందన్నారు. గతంలో ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను మార్చలేదన్నారు. గన్నవరంలో బీసీ నాయకుడిపై దాడి, వాహనాన్ని తగులబెట్టింది వైఎస్సార్‌సీపీ వాళ్లేనని.. తిరిగి బీసీ నాయకుడిపైనే వాళ్లు హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు. మహిళలకు 45ఏళ్లకే పెన్షన్, మద్యపాన నిషేధం, దిశ చట్టం పేర్లతో మోసం చేస్తున్నారన్నారు.