ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమను మోసం చేశారంటూ కొండేపి వైసీపీ ఇన్ ఛార్జ్ పై జానపాడు రైతుల కరపత్రాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 12:33 PM

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్న నేతపై పల్నాడు జిల్లాలో రైతులు కరపత్రాలు విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో పిడుగురాళ్ల, జానపాడులో తమ దగ్గర డబ్బులు, భూములు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని కొండేపి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్‌బాబుపై ఆరోపణలు చేశారు. తమకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.. ఈ మేరకు జానపాడుకు చెందిన రైతులు కరపత్రాలను విడుదల చేశారు. రియల్ ఎస్టేట్ బిజనెస్ చేస్తున్నాని తమ దగ్గర ప్రామిసరీ నోట్ల రూపంలో డబ్బులు, భూములు తీసుకుని.. తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారని.. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెడతానని, తాను అధికారపార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా.. కాబోయే ఎమ్మెల్యేను తనను డబ్బులు అడగవద్దని వార్నింగ్ ఇచ్చారంటున్నారు.


‘మేము అనగా పల్నాడు జిల్లా, పిడుగురాళ్ళ మండలం, జానపాడు గ్రామ ప్రజలము తమరితో మనవి చేయునది ఏమనగా!.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా, కొండేపి నియోజనవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ అశోక్‌బాబు.. మా పిడుగురాళ్ళ ప్రాంతమలో 2010 నుంచి 2018 వరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు. ఆ సమయములో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొరకు మా దగ్గర ఆర్థిక లావాదేవీల కొరకు రైతులమైన మా దగ్గర వున్న డబ్బులు, భూములను ప్రామిసరీ నోట్ల ద్వారా అప్పుగా తీసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ కొరకు భూములు కొన్న వారి దగ్గర కూడా ప్లాట్లు అమ్ముడు పోగానే డబ్బులు ఇస్తానని ప్రామిసరి నోట్లు వ్రాసి ఇచ్చినారు. డబ్బులు అడిగినప్పుడల్లా డబ్బులు సర్దుబాటు కావడం లేదు. కావాలంటే ప్లాట్లు రిజిస్టేషన్‌ చేస్తానని నమ్మబలికేవారు. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా రేఫు, మాఫు అంటూ వెళ్లదీసేవారు’అన్నారు.


‘మాకు డబ్బులు ఇవ్వకుండా అదే వెంచర్‌లో ఆక్స్‌ఫర్డ్‌ కాలేజి ని నిర్మించారు. ఆ తర్వాత డబ్బులు గురించి అడిగితే ఇప్పుడు కాలేజి పెట్టాను జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాను. కొంతకాలం తర్వాత ఇస్తానని చెప్పాడు. ఆ కాలేజీని కూడా ఎవరికి తెలియకుండా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని.. ఆ తర్వాత ఫోన్ నంబర్లు మారుస్తూ తమకు దొరక్కుండా తిరుగుతున్నారని.. ఎవరైనా అడ్రస్ తెలుసుకుని వెళ్లి డబ్బులు అడిగితే.. తాను వైఎస్సార్‌సీపీ తరపున కొండేపి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చేస్తున్నాను. నాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. కాబోయే ఎమ్మెల్యేను.. నన్ను డబ్బులు అడుగుతారా అని బెదిరిస్తున్నారు’అని ఆరోపించారు.


‘మేము వరికూటి అశోక్‌బాబు వ్యాపారం కోసం డబ్బులు ఇస్తే.. ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదన్నారు. రేపు, మాపు అని కాలం గడుతున్నారని.. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆయన నుంచి మాకు ప్రాణ భయం ఉంది. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ స్థాయిలో ఉండి అసభ్య పదజాలంతో, చెప్పుకోలేని విధంగా వేధిస్తున్నారు అని కొండేపి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇలాంటి మోసపూరితమైన వ్యక్తి ప్రజలను ఏమి ఉద్దరిస్తారు.. ప్రజా సేశ చేస్తానని చెప్పుకుంటూ మాయ మాటలతో తన వ్యాపార ప్రయోజనం కోసం ప్రజా ధనాన్ని దోచుకుంటూ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారు. కావున కొండేపి నియోజకవర్గ ప్రజలు ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి మోసపోకండి.. ఇలాంటి వారిని వీధుల్లో తిరగనీయకుండా శిక్షించి, తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నాం’అంటూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ పాంప్లేట్లను కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి కూడా షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com