కాకినాడ జేఎన్‌టీయూకే సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో స్టోర్‌కీపర్‌గా శేషపు శేషగిరిరావు, బాలాజీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరు పదిహేను ఏళ్లుగా చిట్టీలు వేస్తున్నారు. చిట్టీలు వేయమని కోరడంతో హామీ ఏంటని అడుగగా మేము ప్రభుత్వ ఉద్యోగులం గ్యారంటీగా డబ్బులు ఇస్తామని చెప్పడంతో సుమారు 50 మంది జేఎన్‌టీయూకేలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు చిట్టీలు వేశారు. చిట్టీలు పాడిన తర్వాత సొమ్ములు చేతికి ఇవ్వకుండా 17మందిని ఇదిగో, అదిగో అంటూ తిప్పుతున్నారు. నెలల తరబడి చిట్టీల డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో ఇద్దరు ఉద్యోగులపై జేఎన్‌టీయూకే ప్రిన్సిపాల్ వద్ద గతంలో పంచాయతీ జరిగింది. ఫిబ్రవరి 5లోపు బకాయి ఉన్న చిట్టీల డబ్బులు ఇచ్చేస్తానని ప్రిన్సిపాల్ సమక్షంలో వారు అంగీకరించడంతో ఊరుకున్నారు. అయితే ఫిబ్రవరి 4నుంచి వీరిద్దరు జేఎన్‌టీయూకేకు రాకుండా కనిపించకుండా పోయారు. దాంతో సర్పవరం పోలీసులను ఆశ్రయించినట్టు గంటి వెంకటలక్ష్మి, సోమదుల రాజామణి, బంగారు లక్ష్మి, కందికట్ట సత్యవతి, కొప్పిశెట్టి సత్యవతి, నక్కా బేబీ సరోజని, బంగారు దేవి తదితర బాధితులు తెలిపారు. బాఽధితురాలు గంటి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించి కేసు నమోదు చేస్తామని సర్పవరం ఎస్‌హెచ్‌వో ఆకుల మురళీకృష్ణ తెలిపారు. బుధవారం జేఎన్‌టీయూకేలో విచారణ జరుగుతుందన్నారు.