రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆయావర్గాలు గుర్రుగా ఉన్నాయి. ప్రభుత్వ తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నెల 26 నుంచి ఉద్యమం సాగిస్తామని ఇప్పటికే అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు గొంతు ఎత్తకుండా కత్తి పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా చర్యలు తప్పవంటూ సీఎస్ పేరు మీద అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17న సీఎస్ ఉత్తర్వులు ఇవ్వగా జిల్లా ఉన్నతాధికారులకు ఆ మేరకు ఉత్తర్వులు అందాయి. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా అలాంటి వారి వివరాలు జీఏడీకి పంపాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనిపై కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపకూడదనే ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం చేస్తున్న తప్పులను బయటకు చెప్పడానికి లేకుండా చేశారన్న విమర్శలు వస్తున్నాయి.