ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరంలో గొడవలు సృష్టించారు...సజ్జల ఆరోపణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 08:09 PM

గన్నవరంలో గొడవలు సృష్టించారు అంటూ టీడీపీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వైఎస్సార్సీపీ బీసీలకు ఎమ్మెల్సీ పదవులిస్తే.. అది ప్రజలకు తెలియకూడదని గన్నవరంలో గొడవలు సృష్టించారని ఆయన వ్యాఖ్యానించారు. పట్టాభినీ కొట్టారని తప్పుడు వార్తలను చంద్రబాబు, లోకేష్ ట్వీట్ చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఇంప్రేషన్‌ క్రియేట్‌ చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం, వికృత ఆలోచనలకు.. మీడియా తోడైందని.. ఇది ఆర్డీఎక్స్‌ కంటే ప్రమాదకరంగా మారిందని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హననం చేయడమే పనిగా పెట్టుకున్నారని సజ్జల ఆరోపించారు.


'గొడవలు చేయడం, సృష్టించడం అంతా వాళ్లే చేస్తారు. వీళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయని గమనిస్తే.. టీడీపీ శిక్షణా శిబిరంలో చెంగల్‌రాయుడు మాట్లాడుతూ.. ఎవరినైనా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తే.. జడ్జిల ముందు అబద్ధాలు చెప్పండి అని ట్రైనింగ్‌ ఇచ్చారు. పోలీసులు కొట్టకపోయినా చెప్పరాని చోట కొట్టారని చెప్పండి అంటూ టీడీపీ నేతలకు శిక్షణ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడి సమక్షంలో ఆ పార్టీ నేతలకు శిక్షణ ఇస్తున్నారు. వీటిలో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ను లాగి పదవీచ్యుతుడిని చేశాడు. ఇప్పుడు ఆయన ఫోటోకు దండేసి మా నాయకుడు ఎన్టీఆర్‌ అంటున్నాడు' అని సజ్జల ఫైర్ అయ్యారు.


'గన్నవరంలో పది రోజుల నుంచి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, లోకేష్‌కు ఇక్కడికి వచ్చి పోటీ చేయమని వంశీ సవాలు విసిరారు. పట్టాభి అనే వ్యక్తి బూతులు తిట్టడంతో ఆయన్ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. ఈ పట్టాభి నేను వస్తానని సవాల్‌ విసిరి గన్నవరంలోకి వెళ్లే అవసరం ఏముంది? ముఖ్యమంత్రిని బూతులు తిట్టారు. బూతులు తిట్టే పరీక్షల్లో పట్టాభికి ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. గన్నవరం వెళ్లి తిట్టి..మళ్లీ ఇక్కడికి వచ్చి తిట్టారు. పోలీసులపై దాడులు చేస్తే కేసులు పెట్టకుండా ఉంటారా? బాధితుడు సీఐ.. ఆయన దెబ్బతిన్నాడు. అలాంటి వ్యక్తి ఎస్సీ కాదు.. క్రిస్టియన్‌ అని కేసు పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు' అని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


'బూతులు తిట్టడం మా జన్మ హక్కు అంటూ తిడుతూ.. వీరంగం చేస్తే ఊరుకుంటారా? మాకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కేడర్ ఉంది. ఇలాంటి పార్టీ నేతలు మీరు తిడుతుంటే ఊరుకుంటారా? ఏ రోజైనా మేము రెచ్చగొట్టే ఘటనలకు పాల్పడ్డామా.. గన్నవరంలో పట్టాభి రెచ్చగొట్టడం, తిట్టడం, ఎదురెదురు పడటంతోనే గొడవ జరిగింది. పట్టాభి అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు. చట్టప్రకారం కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండుకు పంపించారు. దీన్నంతా పక్కదారి పట్టించారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు' అని సజ్జల వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com