సమష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం. మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్ ని కాపాడుకుందాం" అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై రాష్ట్ర ప్రజలకు బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని లేఖలో టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే విపక్ష నేతలు, ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై, పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేయడం వైసీపీ విధ్వంసానికి తాజా ఉదాహరణ అని చెప్పారు. బాధితులనే నిందితులుగా మార్చి, పోలీస్ టార్చర్ కు గురిచేసి, జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు.
"జగన్ అరాచక పాలనతో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. జీవితాంతం కష్టపడి పేదలు సంపాదించుకున్న ఆస్తులను కబ్జా చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల నిర్బంధాలు, అక్రమ కేసులు... బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు వేధింపులు, మహిళలపై ఆకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారింది. పన్నులపై ప్రజలు ప్రశ్నిస్తే కేసులు, జాబ్ క్యాలెండర్ గురించి గళమెత్తితే నిరుద్యోగ యువతకు వేధింపులు, ధాన్యం బకాయిలు అడిగితే రైతులకు బేడీలు, జీతాలు అడిగితే ఉద్యోగులకు బెదిరింపులు అన్నట్లు పరిస్థితి మారింది.
ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి నేను చేపట్టిన పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఇటీవల జగ్గంపేట, పెద్దాపురంలో మా పర్యటనల అనంతరం...ప్రజా స్పందన చూసి భయపడిన ఈ ప్రభుత్వం... అనపర్తి సభకు అడ్డంకులు సృష్టించింది. సభకు ముందుగా అనుమతులు ఇచ్చిన పోలీసులు ప్రభుత్వ ఒత్తిడితో అడ్డంకులు సృష్టించారు. అయితే నాడు సహాయ నిరాకరణ ఉద్యమంలో మహాత్మా గాంధీజీ చేసిన దండి మార్చ్ స్పూర్తితో... నేను 7 కిలోమీటర్లు నడిచి అనపర్తి మార్చ్ నిర్వహించాను. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ... ప్రభుత్వ తీరును ఎండగడుతూ సాగిన అనపర్తి సభ విజయవంతం అయ్యింది. దీంతో సీఎం ఒత్తిడితో ఎన్నడూ లేని విధంగా ఏకంగా వెయ్యి మందిపై అనపర్తిలో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు.
ప్రజల తరుపున గళం వినిపిస్తున్న బడుగు బలహీన వర్గాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగానే గన్నవరం హింసకు పాల్పడ్డారు. ఈ నెల 20వ తారీఖున గన్నవరంలో కొంతమంది కళంకిత పోలీసు అధికారుల సహకారంతో వైసీపీ గూండాలు ప్రణాళికాబద్దంగా తెలుగుదేశం నేతలపై దాడులు, పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. స్థానిక శాసన సభ్యుడి (వల్లభనేని వంశీ) అరాచకాలను, సంకల్పసిద్ధి స్కాంలో అక్రమాలను గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దొంతు చిన్నాకు ఫోన్ చేసి మా నేతనే విమర్శిస్తావా అంటూ బెదిరించారు. 20వ తేదీ ఉదయం 11.30 గంటలకు వైసీపీ గూండాలు దొంతు చిన్నా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. చిన్నా ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ సమయంలో బాధితులు పోలీసు సాయం అర్ధించినా వారు స్పందించలేదు.
తో అదే రోజు సాయంత్రం నియోజకవర్గ నేతల సహకారంతో ఘటనపై ఫిర్యాదు చేసేందుకు చిన్నా సతీమణి రాణి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. టీడీపీ నేతలంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో...వైసీపీ కార్యాలయం నుంచి వచ్చిన వైసీపీ రౌడీ మూకలు తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. కార్లు, ఇతర వాహనాలు తగలబెట్టారు. కార్యకర్తలు, నేతలపై దాడులుచేశారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు ఆత్మరక్షణ, ఆస్తులు రక్షణకు అక్కడికి వచ్చిన పాపానికి టీడీపీ వారిపైనే పోలీసులు జులుం ప్రదర్శించారు. ఘటనపై నిరసనలు తెలుపుతున్న టీడీపీ కార్యకర్తలపై రెండో సారి కూడా వైసీపీ గూండాలు పోలీసుల ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారు. మళ్లీ రాత్రి 8 గంటలకు దొంతు చిన్నా ఇంటికి వెళ్లి అతని వాహనాన్ని దహనం చేశారు. ఇలా రోజంతా యదేఛ్చగా విధ్వంసం జరుగుతున్నా... ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. మా నేతలు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ దాడుల ఘటనలు అన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో, అక్కడ ఉన్న వారి ఫోన్ లలో రికార్డు అయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే యావత్ సమాజం విస్తుపోయేలా బాధితులైన టీడీపీ కార్యకర్తల పైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.
ఘటనలో 40 మందికి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిలో కొందరిని పోలీసు కస్టడీలో దారుణంగా హింసించారు. మహిళలు అని కూడా చూడకుండా అక్రమంగా అదుపులోకి తీసుకుని రాత్రంతా మార్చి, మార్చి పోలీస్ స్టేషన్లకు తిప్పారు. గన్నవరం దాడులకు స్థానిక ఎమ్మెల్యే వ్యూహరచన చేయగా.... ఆయన వ్యక్తిగత సహాయకుడు, సంకల్పసిద్ధి స్కాంలో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా దాడుల్లో ముందున్నాడు. ప్రజల నుంచి రూ. 1100 కోట్లు అక్రమంగా వసూలు చేసి వారిని మోసం చేసిన సంకల్ప సిద్ది స్కాంలో ఇతను నిందితుడు. ఈ మొత్తం ఘటనలో దాడులకు గురయ్యింది తెలుగుదేశం కార్యకర్తలు, ధ్వంసం అయింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం, తగలబడిన కార్లు తెలుగుదేశం నేతలవి, బెదిరించి, భయభ్రాంతులను చేసింది తెలుగుదేశం నేతలనే, పోలీస్ టార్చర్ అనుభవించింది తెలుగుదేశం వారే, బాధితులూ తెలుగు దేశం వాళ్లే... కానీ పోలీసులు తప్పుడు ఆరోణలతో చివరకు జైల్లో పెట్టింది తెలుగుదేశం వాళ్లనే.
సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ గాని, కార్యకర్తలు గాని, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలు గాని వీటికి భయపడే పరిస్థితి ఉండదు. 40 ఏళ్లుగా పార్టీని ఆదరించిన ప్రజలను కాపాడుకోవడం కోసం, బాధ్యత కలిగిన నేతగా ప్రజలను చైతన్యపరిచి...ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల పీడ నుంచి కాపాడాల్సిన బాధ్యత నాపై ఉందని భావిస్తున్నాను. ప్రశ్నించే ప్రజలు, ప్రజా సంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమే. ఈ పోరాటంలో అందరం కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందాం. సమష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం. మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్ ని కాపాడుకుందాం" అని బహిరంగలేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.