గన్నవరం ఘటన రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర వేడిపుట్టిస్తోంది. అదే సందర్బంలో గంట గంటకూ అక్కడి రాజకీయం మారుతోంది. సోమవారం గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి, ఆ తర్వాత జరిగిన గొడవలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే టీడీపీకి చెందిన కొందరిపై కేసులు నమోదు చేసి.. వారిని రిమాండ్‌కు తరలించారు. దీనిపై TDP అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బాధితులనే.. నిందితులుగా చూపారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో.. గన్నవరం పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీ అనుచరులకు నోటీసులు ఇచ్చారు.
గన్నవరం ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో.. క్రైం నంబరు 136, 353, 427, 435, 143, 147 సెక్షన్ల కింద ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులుగా ఉన్న పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు టీడీపీ నాయకుడు దొంతు చిన్నా భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదుతో క్రైం నంబరు 135 కింద కేసు నమోదైంది. ఈ రెండు కేసులకు సంబంధించి బుధవారం సాయంత్రం వీరిని గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి పంపించినట్లు సీఐ నవీన్ నరసింహమూర్తి వెల్లడించారు.
వైసీపీ కార్యకర్తలపై నమోదు చేసిన కేసులకు సంబంధించి.. ప్రాథమికంగా పది మందిని నిందితులుగా గుర్తించామని.. మిగతా వారిపై కేసులు పెట్టేందుకు ఆధారాలు పరిశీలిస్తున్నామని సీఐ వివరించారు. దీనిపైనా టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్తగా నమోదు చేసిన కేసుల్లో నిందితుల పేర్లను గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపిస్తోంది. తమ కార్యాలయంపై దాడి చేసిన వంశీ అనుచరులపై పోలీసులు కావాలనే తేలికపాటి సెక్షన్లతో కేసులు నమోదు చేశారని.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోరాడతామని స్పష్టం చేస్తున్నారు.