గాల్లో ఎగిరే విమానం కనిపిస్తేనే ఇంటిబయటకు వచ్చి చూసే జనం తమ ఊరికి సమీపంలో ఉండే సుముద్రతీర ప్రాంతానికి భారీ షిప్ వచ్చి ఆగితే సహజంగానే చూసేందుకు ఎగబడతారు. ఇదిలావుంటే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు వద్ద ఓ భారీ నౌక స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది. పోర్టు సర్వే కోసం వచ్చిన ఈ షిప్.. భావనపాడు సముద్ర తీర ప్రాంతంలో నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భావనపాడు తీరం వద్ద నిలిపేశారు మెరైన్ అధికారులు. సాంకేతిక సమస్యను పరిష్కరించుకున్న తర్వాత తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు.
అయితే భావనపాడు సముద్ర తీరానికి పెద్ద నౌక వచ్చిందని స్థానికులకు ఎలాగో తెలిసింది. దీంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ నౌకను చూసేందుకు భావనపాడు వద్దకు తరలివస్తున్నారు. మెరైన్ అధికారులు, నౌక సిబ్బంది వారిని అనుమతించకపోయినా.. దూరం నుంచి నౌకను చూసి ఆనందిస్తున్నారు. చిన్నారులతో పాటు పెద్దలు కూడా నౌకను చూసి సంబరపడుతున్నారు.
సంతబొమ్మాళి మండలం, భావనపాడు సముద్రతీర ప్రాంతంలో నేషనల్ హైడ్రో గ్రాఫిక్స్ సర్వే ను ఇండియన్ నేవీ ప్రత్యేక బృందం ఇటీవల నిర్వహించింది ఈ సర్వేలో తరంగాలు, ఆటుపోట్లు, ప్రవాహాలు, వాయు వేగం, లోతు వంటివాటిపై సర్వే చేశారు. ఈ సర్వేను నౌక, హెలికాఫ్టర్ ద్వారా నిర్వహించారు. ఈ నౌక కూడా ఆ సర్వేకు చెందినదేమోనని స్థానికులు భావిస్తు్న్నారు.