పాలకుల నుంచి ప్రజలను రక్షించడానికి రాష్ట్రంలోనూ ఏక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారేమో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు అనంతరం.. తనకు తానే జగన్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగడానికి ఎన్నికల కమిషన్ అంగీకరించకపోవడంతో తన ప్రతిపాదనను విరమించుకున్నారన్నారు. పార్టీలో ఏక్ నాథ్ షిండేలు ఉండబోరని తాను చెప్పలేనని.. తాను మాత్రం ఏకనాథ్ షిండే తరహాలో వ్యవహరించబోనన్నారు. తప్పు జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన టీడీపీ నేత పట్టాభిపై 10 సెక్షన్ల కింద తప్పుడు కేసులు నమోదు చేయడం ఏపీ పోలీసులకే చెల్లిందన్నారు. ఎటువంటి తప్పు చేయని వ్యక్తిని దారుణంగా హింసించారని.. రాత్రంతా పోలీస్ స్టేషన్ లో కూర్చో బెట్టడం దారుణమన్నారు. పట్టాభి ఈ కేసులపై న్యాయ పోరాటం చేయాలన్నారు.
సీఐ కనకారావుకు టీడీపీ నేత విసిరిన రాయి తగిలే గాయమైందన్నారని.. రాళ్ళల్లోనూ టీడీపీ, వైఎస్సార్‌సీపీ రాళ్లని వేరువేరుగా ఉంటాయా అని ప్రశ్నించారు. కనకారావు ఇచ్చిన ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ కార్యాలయంపై అధికార పార్టీ కార్యకర్తల దాడిని నిలువరించలేకపోవడం పోలీసు అధికారుల వైఫల్యం కాదా అన్నారు. టీడీపీ కార్యాలయం ముందు ఉన్న వాహనాలకు తమ పార్టీ వారు నిప్పు పెట్టి దగ్ధం చేస్తున్నపుడు పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.
లా నేస్తం అనే సంక్షేమ పథకానికి టంగుటూరి ప్రకాశం పంతులు పేరెందుకు పెట్ట లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమానికి తన తండ్రి పేరు లేదంటే తన పేరును ముఖ్యమంత్రి జగన్ పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరును పెట్టామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.. లా నేస్తం పథకానికి వైఎస్ పేరును ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. లా నేస్తం పథకానికి కోటి 55 వేల రూపాయలను బటన్ నొక్కి విడుదల చేస్తే.. ఆ పథకం ప్రచారానికి నాలుగు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం దారుణమన్నారు. ఆ నాలుగు కోట్ల రూపాయలను మరేదైనా సంక్షేమ కార్యక్రమానికి వినియోగించి ఉంటే ప్రజలకు మేలు జరిగి ఉండేది అన్నారు.
ప్రభుత్వ పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్) ద్వారా లబ్ధి పొందడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, తమని వాలంటీర్ ఎంపిక చేయలేదని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకానికి అర్హులను ఎంపిక చేయడానికి వాలంటీర్లు ఎవరని న్యాయమూర్తి ప్రశ్నించారన్నారు. ఎటువంటి జవాబుదారితనం లేకుండా కేవలం గౌరవ వేతనంతో పని చేసే వాలంటీర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు.