హిజ్రాను ధారుణంగా హత్య చేసిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకొంది. యలమంచిలి మండలం ఎర్రవరం సమీపంలో ఓ హిజ్రాను హత్యచేసి సగం కాల్చేసి రోడ్డుపక్కనే పడేయడం కలకలంరేపింది. మర్రిబంద సమీపంలో సగం కాలిన మృతదేహం పడి ఉంది. స్థానిక ప్రైవేటు సంస్థ ఆఫీసుకు వెళ్లే దారిలో కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు అటు వైపుగా వెళ్లాడు. ఆ ప్రాంతంలో ఉన్న గోతిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. వెంటనే ముందుకు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది.
వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్పీ గౌతమిసాలి, డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉండే హిజ్రాలను తీసుకొచ్చి చూపించగా తమ వారెవరూ కాదని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 20 ఏళ్ల వయసున్న హిజ్రా మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోయి ఉంటారని చెబుతున్నారు. మృతురాలి శరీరం, ముఖంపై గాయాలు ఉన్నాయి.
గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ మనిషిని ముక్కలు ముక్కలుగా నరికి పడేసిన ఘటన జరిగింది. మరోసారి ఇక్కడ మృతదేహం కనిపించడం కలకలంరేపుతోంది. యలమంచలివాసులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.