బద్ధశత్రువులైన టీడీపీ వైసీపీ నేతలు హాయ్ చెప్పుకున్నారు. ఒకరికి ఒకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నారు. విశాఖ కలెక్టరేట్ వద్ద ఈ అపురూప సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉత్తరాంధ్ర పట్టభద్రుల అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఊరేగింపుగా కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్‌కు మద్దతుగా మంత్రులు అమర్నాథ్, వేణుగోపాలకృష్ణ, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, వైసీపీ ఎమ్మెల్యేలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు మద్దుతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ విశాఖ పట్నం పార్లమెంటరీ నేత పల్లా శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు కూడా అదే సమయంలో కలెక్టరేట్ వచ్చారు. ఒకరి కొకరు ఎదురు పడడంతో అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావులు వైసీపీ మంత్రులు అమర్నాధ్, వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావులతో కాసేపు మాట్లాడారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంపై ఒకరికొకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నారు. ఇలా టీడీపీ. వైసీపీ నేతలు కలవడం అక్కడున్నవారికి వింతగా అనిపించింది.