మైనర్ ఇరిగేషన్ చెరువులలో ఎవరైనా అనుమతి లేకుండా మట్టిని తరలిస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు, మట్టిని తరలించిన వ్యక్తులపై కూడా కేసులు పెడతామని పత్తికొండ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. చంద్రశేఖర్ అన్నారు. గురువారం తుగ్గలి మండలంలోని రాంపల్లి చెరువులో మట్టిని తరలిస్తున్నారని సమాచారం అందుకున్న డిఈఈ ఆర్. చంద్రశేఖర్, ఏఈఈ జి. చంద్రశేఖర్ లు చెరువును పరిశీలించారు. అయితే ఆ సమయంలో చెరువులో ఎవరూ లేకపోవడంతో చెరువును పరిశీలించి వచ్చారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఎవరికైనా చెరువులో మట్టి కావాలి అంటే మైనర్ ఇరిగేషన్ అధికారులకు దరఖాస్తులు చేసుకుంటే మట్టి తరలించేందుకు నిబంధనల ప్రకారం అనుమతిని ఇస్తామని వారు తెలిపారు. అనుమతి లేకుండా బొందిమడుగుల చెరువులో మట్టి తరలిస్తుంటే అక్కడ వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అందువల్ల ఎవరైనా చెరువుల్లో అనుమతి లేకుండా మట్టిని తరలిస్తే కేసులు పెడతామని వారు హెచ్చరించారు.