నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏడాది 54, 69, 577 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం మహానంది దేవస్థాన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది 6, 77, 470 రూపాయలు అదనంగా ఆదాయం లభించిందన్నారు. గత ఏడాది 47, 92, 107 రూపాయలు రాగా ఏడాది 54, 69, 577 వచ్చిందన్నారు. ఇందులో స్వామివార్ల దర్శన టికెట్ల విక్రయం ద్వారా 18, 72, 622 రూపాయలు వచ్చిందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఒక లక్షా 102 రూపాయలు అదనంగా ఆదాయం లభించింది అన్నారు. తాత్కాలిక షాపులు, జెయింట్ వీల్ ద్వారా 9, 44, 650 రూపాయలు వచ్చింది అన్నారు. ఒక రథోత్సవం రోజు మాత్రమే దాదాపు 40 వేలమంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందింది అన్నారు. ఈ ఏడాది జరిగిన పొరపాట్లను వచ్చే ఏడాది జరగకుండా ఉత్సవాలను మరింత దిగ్విజయం చేసేందుకు కృషి చేస్తామన్నారు.