దొంగతనాలకు దొంగలు హైవేపై హల్‌చల్ చేస్తున్నారు. నిలిపి ఉన్న వాహనాలను టార్గెట్ చేస్తున్నారు. ఇళ్లు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..! ఇవీ.. సాధారణంగా దొంగల టార్గెట్లు. కానీ ఇప్పుడు వారు రూటు మార్చారు. గ్రామీణ, పట్టణ రహదారుల్లో పోలీసుల అవతారం ఎత్తుతున్నారు. అందినకాటికి దోచుకుపోతున్నారు. హైవేలపై అర్ధరాత్రి మొదలుపెట్టి.. తెల్లవారుజామున ముగిస్తున్నారు. పల్లె, పట్టణ మార్గాల్లో పట్టపగలే ‘వాహనాల తనిఖీ’ చేపడుతున్నారు. ఉన్నదంతా పీక్కుని ఉడాయిస్తున్నారు. దొంగలను, దొంగ పోలీసులను పట్టుకోవాల్సిన పోలీసులు.. డ్రంకెన డ్రైవ్, మద్యం కేసుల నమోదులో బిజీగా ఉన్నారు. పాత కేసులే తేలలేదు. ఇక కొత్త కేసులు.. అందులోనూ హైవేలపై బైక్‌లపై వెళుతూ దోపిడీ చేస్తున్న అగంతకులను ఎప్పుడు పట్టుకుంటారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే హైవే పెట్రోలింగ్ ఏమైందన్న విమర్శలు వస్తున్నాయి.