ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి శుక్రవారం రెండోసారి సీబీఐ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో ఆయనను తొలిసారి గతనెల 28వ తేదీన ప్రశ్నించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో సుదీర్ఘంగా ఈ విచారణ జరిగింది. అవినాశ్ రెడ్డి ‘కాల్ డేటా’ ఆధారంగా అప్పట్లో కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. వివేకా హత్య జరగడానికి ముందు, తర్వాత ఆయన రెండు నంబర్లతో మాట్లాడినట్లు గుర్తించారు. జగన్‌తో మాట్లాడేందుకు ఆయన ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతీరెడ్డితో మాట్లాడేందుకు ఆమె వ్యక్తిగత సహాయకుడు నవీన్ నంబర్లకు కాల్ చేసినట్లువెల్లడైంది. దీని ఆధారంగా ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌లను కూడా సీబీఐ ప్రశ్నించింది. వారిచ్చిన సమాచారం మేరకు.. అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఈ నెల 23న, అవినాశ్‌రెడ్డిని 24న విచారణకు రావాలంటూ సీబీఐ ఈ నెల 18న నోటీసులు ఇచ్చింది. అయితే... 23న హాజరు కాలేనని భాస్కర్‌రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. అవినాశ్ రెడ్డి మాత్రం శుక్రవారం మరోసారి సీబీఐ ముందు హాజరుకానున్నారు.