రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పట్టభద్రులకు వివరించాలని పార్టీ శ్రేణులకు టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. వచ్చే నెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేపాడ చిరంజీవిని గెలిపించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందన్నారు. విద్యారంగంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పన తదితర అంశాల్లో కూడా ఏపీ వెనుకబడిందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పట్టభద్రుల ఓటర్ల జాబితాలను క్షేత్రస్థాయికి పంపించారని, ఓటును గుర్తించడంతో పాటు ప్రతి ఓటరు వద్దకు వెళ్లి టీడీపీ బలపరిచిన అభ్యర్థి వేపాడ చిరంజీవికి మద్దతుగా నిలవాలని కోరాలని చెప్పారు. విజయనగరం నగర పరిధిలోని అన్ని పోలింగు కేంద్రాల వద్ద వివిధ డివిజన్లకు సంబంధించిన పార్టీ శ్రేణులు వుండి, అక్కడ కూడా ఎన్నికల నిబంధనలు అనుసరించి ముందుకు సాగాలన్నారు.