రాష్ట్రంలో ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలివిడత దక్షిణాదిలోని నాలుగు వేలంకేంద్రాల్లో వేలం చేపట్టనున్నారు. అందులో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు-1, వెల్లంపల్లి, పొదిలి, కొండపి కేంద్రాలు ఉన్నాయి. దక్షిణాదిలోని రెండు రీజియన్లలో మొత్తం 11 వేలంకేంద్రాలు ఉండగా ఈ నాలుగు పోను మిగిలినవి ఒంగోలు-2, టంగుటూరు, కనిగిరి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు-1, కందుకూరు-2 కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో వచ్చేనెల 9న ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లను పొగాకు బోర్డు అధికారులు చేశారు. దక్షిణాది రీజియన్లలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, పెరిగింది. గత ఏడాది మార్కెట్లో మంచి ధరలు లభించాయి. మేలు రకంతో పోటీపడి మీడియం, లోగ్రేడ్ ధరలు పలికాయి. పలువురు వ్యాపారులు బేళ్ల కోసం పోటీపడి కొనుగోలు చేశారు. దాంతో కిలో సగటు ధర రూ.172.49 లభించింది. అధికశాతం మంది రైతులకు ఆదాయం లభించింది. దీనికి తోడు ఈ ఏడాది కర్ణాటకలో పంట దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. తదనుగుణంగా ధరలు గతం కన్నా పెరగడంతోపాటు హాట్‌హాట్‌గా మార్కెట్ సాగింది. ఈ నేపథ్యంలో పొగాకు సాగు వైపు రైతులు మొగ్గుచూపారు.