రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయ్. మీకు లోన్ మంజూరైంది. రుణం పొందేందుకు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. తదుపరి ప్రాసెసింగ్ పూర్తయిన వెంటనే మీ అకౌంట్లో రుణం జమ చేయబడుతుందంటూ వస్తున్న సెల్‌ఫోన్ సమాచారాలకు ఆకర్షి తుల వుతున్న యువత తర్వాత మోసపోతున్నారు. ఇదేకోవలో నూజివీడుకు చెందిన ఏలియా అనేవ్యక్తికి రూ.50వేల వరకు రుణం ఇస్తామంటూ ఫోన్ రావడంతో ఆకర్షితుడై ఆ వలలో చిక్కుకున్నాడు. ఏలియా రుణం కావాలని అంగీకరించడంతో గతనెల 25వ తేదీ రుణమంజూరు పత్రంను రెడ్‌బుల్ యాప్ నుంచి పంపినట్లుగా అతడికి సమాచారం వచ్చింది. అందుకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రుణం పొందవచ్చంటూ మెసేజ్ రావడంతో ఆర్థిక అవసరాలు తీరతాయనే ఉద్దేశంతో ప్రాసెసింగ్ ఫీజును ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. ఇదే అదునుగా ఆన్‌లైన్‌లోకి వచ్చిన అగంతకుడు ఏలియా నుంచి సర్వీస్‌ఛార్జ్, ఈఎంఐ, ఎన్‌వోసీల కోసం అంటూ ఆరు విడతలగా రూ.32 వేలు వసూలు చేశాడు. కేవలం రూ.50 వేల రుణానికి రూ.32 వేలు ఎదురుకట్టడం ఏమిటని స్నేహితులు ప్రశ్నించడంతో చివరికి మోసపోయానని గ్రహించి ఏలూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. ఎస్పీ నుంచి స్థానిక పోలీసులకు ఈ కేసు వివరాలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ లోన్ యాప్‌ల మాయలో ఎంతోమంది అమాయకులు మోసపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు పోలీస్ అధికారులు లోన్‌యాప్‌ల పైన అప్రమత్తంగా ఉండాలని విస్త్రృతప్రచారం నిర్వహిస్తున్నా సెల్‌ఫోన్‌లలో వస్తున్న ఈ కాల్స్‌తో యువత మోసపోవడం పరిపాటిగా మారుతోంది. లోన్‌యాప్‌ల పై ప్రజలు జాగ్రత్తగా ఉండా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.