ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు బి.రెడ్డిదొర డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. పదవి విరమణ తరువాత ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కొనసాగాలంటే పాత పెన్షన్ విధానం తప్పనిసరి అని ప్రతిపక్షనేతగా చెప్పారని, అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానంను అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ ప్రతీనెలా 1న జీతాలు, పెన్షన్‌లు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ పీవీఆర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, జీఏఎస్ చెల్లింపులు రుణాలను తక్షణమే చెల్లించాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో సోమేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శాస్త్రి, మండల అధ్యక్షుడు ఐవి రత్నం తదితరులు పాల్గొన్నారు.