ఎన్నికలు ఏ క్షణాన జరిగినా ఆ మేరకు ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా పార్టీ వ్రేణులను క్షేత్రస్థాయి నుంచి మరింత ఉత్సాహపరిచి ఎన్నికల బరిలోకి దుమికేలా కార్యాచరణకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమైంది. క్షేత్ర స్థాయి నాయకత్వాన్ని మరింత పటిష్టపరిచేలా రంగం సిద్ధం చేస్తున్నారు. ముందస్తుగా అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయన్న సంకేతాలు ఓ వైపు, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌లో పోరాట పటిమ పెంచడమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు అస్త్రం సంధించేలా జోనల్ స్థాయిలో సమరానికి శ్రీకారం చుడుతున్నది. మండల స్థాయిలో ఇన్‌చార్జ్‌ల దగ్గర నుంచి క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, బూత్ ఇన్‌చార్జ్‌లు వరకు దిశ, దశ కల్పించేందుకు శుక్రవారం అంకురార్పణ చేస్తున్నారు. దీనికి ఏలూరు సమీపాన ఉన్న జాతీయ రహదారిపక్కన స్వరాజ్ ట్రాక్టర్ కంపెనీ ఎదురుగా ఏడు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.