డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడుకు చెందిన యువకుడికి జీఎస్టీ చెల్లించాలంటూ ఢిల్లీ నుంచి నోటీసు జారీ అయ్యింది. అసలు వ్యాపారమే చేయనప్పుడు తాను జీఎస్టీ ఎలా చెల్లించాలంటూ ఆ యువకుడు విస్తుపోతున్నాడు. మదనపు మోహన్‌కిరణ్ (22) అలియాస్ అవినాశ్ స్థానికంగా ఓపెన్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే ఇతడు ఢిల్లీలో జైశ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజస్ పేరిట వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నట్టు, 2022 జూన్ నుంచి అక్టోబరు వరకు రెండున్నర కోట్ల మేర వ్యాపారం చేసినట్టు జీఎస్టీ రికార్డుల్లో నమోదైంది. సంబంధిత మొత్తానికి జీఎస్టీ చెల్లించాలని గతేడాది డిసెంబరు 12న ఢిల్లీలోని జీఎస్టీ కేంద్ర కార్యాలయం నుంచి కమిషనరు పేరిట నోటీసు జారీ అయ్యింది. తాజాగా 15 రోజుల క్రితం మరో నోటీసురాగా దానిని తీసుకోకుండా తిప్పి పంపించాడు. గురువారం అతడు తనకందిన మొదటి నోటీసుతో వెళ్లి మండపేట రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రూ.40లక్షలకు పైగా జీఎస్టీ ట్యాక్స్ చెల్లించాలనడం సరికాదని, తానసలు వ్యాపారమే చేయనప్పుడు ట్యాక్స్ ఎలా కడతానని అన్నాడు.