రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించిన 1,70,203 మంది రైతుల ఖాతాల్లో గురువారం ఒక్క రోజే రూ.1,611.27 కోట్లు జమ చేసినట్లు పౌర సరఫరాల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. ఇప్పటి వరకు 6,00,796 మంది రైతుల నుంచి రూ.6,731.40 కోట్ల విలువైన 32,96,452 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఓ ప్రకటనలో వివరించారు. అందులో ఇప్పటివరకు 5,76,442 మంది రైతుల ఖాతాల్లో రూ. 6,483.97 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీలను రైతులు ఖర్చు చేస్తే.. ఆ డబ్బులను కూడా 21 రోజులలోపు మద్దతు ధరతో కలిపి చెల్లిస్తున్నామని తెలిపారు. ఆయా చార్జీలు రూ.91.26 కోట్లకు గాను ఇప్పటివరకు రూ.79.68 కోట్లు (87 శాతం) రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు.