భారత్ ఔషధ రంగంలో ప్రగతి సాధిస్తోందని అమెరికాలోని ఎఫ్‌డీఏ (డ్రగ్ క్వాలిటీ డివిజన్) డైరెక్టర్ డాక్టర్ కార్మిలో రోసా అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఏయూ-యూఎస్ ఎఫ్‌డీఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘కరెంట్ గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్’ రెండు రోజుల వర్కుషాపును గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నాణ్యమైన ఔషధాల తయారీకి నిరంతర కృషి జరగాలన్నారు. ఔషధాల తయారీకి మరింత మెరుగైన, నాణ్యమైన విధానాలు అనుసరించడం ఎంతో అవసరమన్నారు. ఇందుకుగాను చట్టాలకు అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. రెగ్యులేటర్లకు సైతం అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. సురక్షితమైన, నాణ్యమైన ఔషధ, ఆహార ఉత్పత్తులు అమెరికాకు అందించే దిశగా ఎఫ్‌డీఏ పనిచేస్తున్న విధానాన్ని కార్మిలో రోసా వివరించారు. ఔషధ తయారీ, అనుమతులు, వినియోగం వరకు వివిధ దశల్లో అమలు చేస్తున్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఔషధ తయారీలో నియమావళిని క్షుణ్ణంగా పరిశ్రమలు తెలుసుకోవలసిన అవసరం ఉందని స్పష్టంచేశారు.