కడపలో యోగి వేమన పేరిట ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో కొందరు తెలుగు తల్లిని, తెలంగాణ తల్లిని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. తెలుగు విభాగం చేసిన నిర్వాకం భాషాప్రియులను నివ్వెరపరుస్తోంది. ఈనెల 21న యూనివర్సిటీలో తెలుగు శాఖ విభాగాధిపతి ఆచార్య జి.పార్వతి అధ్యక్షతన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ హ్యూమనిటీస్ డీన్ ఆచార్య తప్పెట రాంప్రసాద్‌రెడ్డి, తెలుగు శాఖ ఆచార్యులు, వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నల్లపురెడ్డి ఈశ్వర్‌రెడ్డి తదితరులు మాతృభాష గొప్పతనం గురించి పద్యాలు, అర్థ తాత్పర్యాలతో వివరించారు. మాతృభాషను ప్రేమించాలని సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ఫొటోలు చూసి విద్యార్థులు అవాక్కయ్యారు. వేదికపైన డిస్‌ప్లేలో తెలుగు తల్లి బదులు తెలంగాణ తల్లి ఫొటో కనిపించింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు దాటింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకుంది. తెలుగు తల్లికి, తెలంగాణ తల్లికి తేడా తెలియని వారు యూనివర్సిటీలో ఉండటం బాధాకరమని పలువురు విమర్శిస్తున్నారు.