వారం రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, రంగంపేటలోని ఎస్టీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు మహిళలు మాట్లాడుతూ స్థానిక ఎంపీడీవో కార్యాలయం పక్కనే ఉన్న ఎస్టీ కాలనీ వాసులకు మంచినీళ్లు రావడంలేదన్నారు. జి.దొంతమూరు నుంచి పైపులైన్ ద్వారా తమ కాలనీకి మంచినీరు వస్తుందని, వారం రోజులుగా రాకపోవడంతో అధికారులకు అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా పంచాయతీ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు స్పందించి ఎస్టీ కాలనీకి మంచినీళ్ళు ఇప్పించాలని కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ ఎస్.సాయికుమార్‌ను వివరణ కోరగా జి.దొంతమూరు సీపీడబ్ల్యుఎస్ స్కీమ్ నుంచి వచ్చే మంచినీటి ఫిల్టర్ వాటర్ పైపులైన్‌ను ఏడీబీ రోడ్డు విస్తరణలో భాగంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం దగ్గర పైపు లీకుకు గురికావడంతో మూడు రోజులుగా నీటి సరఫరా ఆగిందని, దీనికి గురువారం మరమ్మతులు నిర్వహించామని, శుక్రవారం నుంచి యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు.