తనపై తపుడు వార్తలు రాసి అనవసరరాద్దాంతం చేయోద్దని మీడియాకు ఎంపీ వై.ఎస్..అవినాష్ రెడ్డి కోరారు. ఇదిలావుంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ మరోసారి విచారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం తన న్యాయవాదులతో కలిసి రెండోసారి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి వెంట లాయర్లు వచ్చినా.. వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన ఒక్కరే విచారణకు వెళ్లారు. సుదీర్ఘ విచారణ తర్వాత అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
'వివేకా కేసు దర్యాప్తులో భాగంగా రెండోసారి సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసినంత మేరకు సమాధానాలు చెప్పాను. ఈ అంశంపై గతంలోనే నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు మరోసారి కోరుతున్నాను. నేను వైఎస్ విజయమ్మ దగ్గరకు వెళ్తే.. ఆమెను నేను బెదిరించి వచ్చినట్లు డిబేట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. నేను దుబాయ్‌కి వెళ్లానని వక్రీకరించే వార్తలు రాస్తున్నారు. విచారణ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరుతున్నా' అని ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'160 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నా. హత్య జరిగిన రోజు నేను వెళ్లే సరికి ఘటనా స్థలంలో లేఖ ఉంది. అది ఎందుకు దాచారు? లాయర్లను అనుమతించి ఆడియో.. వీడియో రికార్డు చేయాలని కోరాను. ఇవాళ జరిగిన విచారణ రికార్డు చేసినట్లు లేదు. గత నెల 28న మొదటిసారి నన్ను అధికారులు విచారించారు. అప్పుడు మరోసారి రావాల్సి ఉంటుందని చెప్పారు. శుక్రవారం విచారణ అనంతరం మరోసారి రావాల్సి ఉంటుందని అధికారులు ఏమీ చెప్పలేదు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయొద్దు' అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.