ఏకగ్రీవ ఎన్నికల్లో తొలి విజయం వైసీపీకే వరించింది. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా.. అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం.. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేత వేలూరు రంగయ్య దాఖలు చేసిన నామినేషన్లో.. సరైన వివరాలు, డాక్యూమెంట్లు లేకపోవడంతో ఆయన నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ నామినేషన్ ఒక్కటే ఉండటంతో ఆమె ఏకగ్రీవం లాంఛనం కానుంది.
వాల్మీకి మంగమ్మకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య శుభాకాంక్షలు చెప్పారు. వెనుకబడిన వర్గానికి చెందిన తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంగమ్మ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలినట్టైంది. ఫోర్జరీ సంతకాలతో టీడీపీ బుక్కయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్వతంత్ర అభ్యర్థులు స్పందించారు. తమ సంతకాలు ఫోరర్జీ చేశారని చెప్పారు.