పట్టభద్రులను నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్ రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకమని టిడిపి తరఫున పోటీ చేస్తున్న పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని గెలిపించడానికి పార్టీ శ్రేణులు అందరూ కష్టపడి పని చేయాలని పల్లె కోరారు. అనంతరం పల్లె విలేకరులతో మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు తప్ప అభివృద్ధి లేదన్నారు. టిడిపి నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ ఒక శాడిస్ట్, నియంత పాలన చేస్తున్నారని చరిత్రలో ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారన్నారు. ఎన్నికల సమయంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. 2. 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉత్త ప్రగల్బాలు పలికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను ఊడ గొడుతున్నారన్నారు. టిడిపి హయాంలో ఇస్తున్న నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 2 వేలు ఇచ్చే వారమని దానిని రద్దు చేశాడన్నారు. డి ఎస్ సి అమలు చేయలేదని, తాము 1. 70 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఈ ఎన్నికలలో పట్టభద్రులు, నిరుద్యోగ యువత తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ ఎల్ఐసి నర్సింహులు, జిల్లా నాయకులు సాలక్క గారి శ్రీనివాసులు, సామకోటి ఆదినారాయణ, బొమ్మయ్య, మాజీ సర్పంచ్ శ్రీరామ్ నాయక్, సుధాకర్, తెలుగు యువత రాష్ట్ర నాయకులు అంబులెన్స్ రమేష్, టిడిపి అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు.