‘‘అధికారికంగా క్రైస్తవ మతం స్వీకరించిన వ్యక్తి దళిత కులానికి చెందడు. మత మార్పిడి తర్వాత ఆ వ్యక్తి బీసీ(సీ) వర్గానికి చెందుతారని చట్టం నిర్ణయించింది. ఈ చట్టాన్ని ధిక్కరించి గన్నవరంలో క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఎస్సీ అత్యాచార చట్టం కింద కేసులు పెట్టారు’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ మేరకు కమిషన్ చైర్మన్‌కు 11 పేజీల లేఖను శుక్రవారం పంపారు. ‘‘గన్నవరం సీఐ పొగిరి కనకారావు ఫిర్యాదు మేరకు డీఎస్పీ విజయ్ పాల్ టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో కనకారావు క్రైస్తవుడని స్పష్టంగా రాశారు. క్రైస్తవుడు ఫిర్యాదు చేస్తే ఎస్సీ చట్టం కింద కేసు ఎలా పెడతారు? దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆ ఫిర్యాదులో రామయ్య కోరారు. ఈ లేఖను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కూడా పంపారు. ఎఫ్‌ఐఆర్ ప్రతిని కూడా ఆయన ఈ లేఖలకు జత చేశారు.