భారతీయుల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రపంచంలోనే మేటి సంస్థలకు పలువురు భారతీయులు సారథ్యం వహిస్తున్నారు. తాజాగా, మరో భారతీయుడు ప్రతిష్టాత్మక పదవికి అడుగు దూరంలో ఉన్నారు. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు. బంగా నామినేషన్‌కు ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర తెలపడమే తరువాయి. అన్నీ అనుకున్నట్టు సాగితే ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా, సిక్కు అమెరికన్‌గా బంగా చరిత్ర సృష్టిస్తారు.
63 ఏళ్ల బంగా.. ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ కంపెనీ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో మాస్టర్‌కార్డ్ అధ్యక్షుడిగా, సీఈవోగా విధులు నిర్వర్తించారు. 2016లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అత్యంత కీలకమైన ప్రస్తుత తరుణంలో ప్రపంచ బ్యాంకును ముందుండి నడిపించగల సామర్థ్యం బంగాకు ఉందని బైడెన్ విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. మూడు దశాబ్దాల పాటు పలు అంతర్జాతీయ సంస్థలను విజయవంతంగా నడిపించిన అనుభవం ఆయన సొంతమని అమెరికా అధ్యక్షుడు తన ప్రకటనలో పేర్కొన్నారు.
పర్యావరణ మార్పుల అంశం సహా ప్రపంచం ముందున్న ప్రస్తుత అన్ని సవాళ్లను బంగా సమర్థంగా ఎదుర్కోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ఆయన గతంలో సన్నిహితంగా పనిచేశారు. తాను పదవి నుంచి త్వరలోనే తప్పుకుంటానని ప్రపంచ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పస్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 2024 చివరకు ఆయన పదవీకాలం ఉండగా.. దాదాపు రెండేళ్ల ముందు తప్పుకుంటున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమయ్యింది.
అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ మార్చి 29 వరకు కొనసాగుతోంది. అనంతరం బోర్డులోని డైరెక్టర్లు ఎవరివైపు మొగ్గుచూపితే వారే అధ్యక్షుడవుతారు. సాధారణంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అమెరికన్.. ఐఎంఎఫ్ చీఫ్‌గా యూరోపియన్లే కొనసాగుతారు. అయితే, మొదటిసారి అమెరికాయేతర వ్యక్తి నామినేట్ కావడం విశేషం. ప్రపంచ బ్యాంకులో అమెరికా అధిక వాటాలను కలిగి ఉంది.
బైడెన్ యంత్రాంగంలోని ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘మాస్టర్ కార్డు, జనరల్ అట్లాంటిక్ సంస్థలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, హరిత పరివర్తనను శక్తివంతం చేయడంలో సహకరించేలా ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడానికి అజయ్ ప్రాధాన్యతనిచ్చాడు.. ఇవి ప్రపంచ బ్యాంకులో రాబోయే సంవత్సరాల్లో అతని సామర్ధ్యాన్ని నడిపించే అనుభవాలు, ప్రాధాన్యతలు’’ అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa