ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లం ముక్క నమిలితే ప్రాణాలు కావచ్చంటూ ప్రచారం,,,అందులో వాస్తవంలేదన్నసీనియర్ వైద్యులు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 04:55 PM

సోషల్ మీడియా వచ్చాక  ప్రతి అంశంపై ఎవరుపడితే వారు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిదే గుండె పోటుకు చెందిన ఓ వీడియో చికిత్స రెమిడి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలావుంటే ఇటీవలి కాలంలో గుండె పోటు బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూనే ప్రాణాలు వదలడం అందర్నీ కలచి వేసింది. నగరంలోని ఆరాంఘర్‌లో ఓ యువకుడు బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా.. గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. అక్కడికి దగ్గర్లో ఉన్న సైబరాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై సీపీఆర్ చేశారు.


దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో గుండెపోటు వచ్చాక ప్రాణాలను కాపాడుకునే చిట్కాలు చెప్పే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అల్లం ముక్కను తింటే గుండెలో బ్లాకేజీ తొలగిస్తుందని ఓ వ్యక్తి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని ఏ భంగిమలో కూర్చోబెట్టాలనే విషయాన్ని కూడా సదరు వ్యక్తి చెప్పడం గమనార్హం.


ఈ వైరల్ వీడియో పట్ల బెంగళూరుకు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి స్పందించారు. ఓ భంగిమలో కూర్చోవడం, అల్లం వెల్లుల్లి, ధనియాలు, మిర్చి నమలడం.. దగ్గడం, తుమ్మడం, నవ్వడం లాంటివేవి హార్ట్ ఎటాక్ నుంచి కాపాడలేవన్నారు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం, చేతి నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే తొలి గంటలోనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు.


వాస్తవానికి గుండె కండరానికి తగినంత రక్తం సరఫరా కాకపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. గుండెకు రక్త సరఫరాను పునరుద్ధరించడానికి చికిత్సను వెంటనే ప్రారంభించాలి. ఆలస్యమయ్యే కొద్దీ.. గుండె కండరం దెబ్బతింటుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ హార్ట్ ఎటాక్‌కు ముఖ్య కారణం అవుతుంది.


హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే విషయంలో అల్లం సహయపడుతుందని ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించే వెబ్‌ఎండీ వెల్లడించింది. కానీ హార్ట్ ఎటాక్ బారిన పడిన వ్యక్తి అల్లం తినడం వల్ల వెంటనే హార్ట్ బ్లాకేజీని తొలగిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఫ్యాక్ట్‌లీ వెల్లడించింది.


హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మయో క్లీనిక్ సూచనలు..


* అంబులెన్స్ కోసం వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయాలి.


* ఎమర్జెన్సీ హెల్ప్ అందేలోగా ఆస్పిరిన్ ట్యాబెల్‌ను నమిలి మింగాలి. ఆస్పిరిన్ ట్యాబ్లెట్ రక్తం గడ్డకట్టకుండా ఉండటంలో సహకరిస్తుంది.


* హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో ఆస్పిరిన్ తీసుకుంటే గుండె దెబ్బతినడాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే మీకు ఏదైనా అలర్జీ వస్తుందని తెలిస్తే దాన్ని తీసుకోవద్దు.


* ఒక వేళ మీకు ఇంతకు ముందే నైట్రో-గ్లిజరిన్‌ను సూచిస్తే. ఎమర్జెన్సీ సాయం అందేలోగా నైట్రో గ్లిజరిన్ తీసుకోవచ్చు.


* గుండెపోటు వచ్చిన వ్యక్తి స్పృహలో లేకపోతే వెంటనే సీపీఆర్ ప్రారంభించాలి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa