న్యాయ పోరాటంతో ఓ ప్రయాణికుడు కర్ణాటక ఆర్టీసీపై విజయం సాధించాడు. తనకు బస్సు కండక్టరు ఇవ్వాల్సిన రూపాయి కోసం ఓ ప్రయాణికుడు మూడేళ్ల పాటు న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు. ఈ విషయంలో అతడి ప్రయత్నాన్ని వినియోగదారుల కోర్టు అభినందించింది. బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కి రూ.3,000 జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. రమేశ్‌నాయక్ అనే వ్యక్తి 2019 సెప్టెంబరు 11న బీఎంటీసీ వోల్వో బస్సులో శాంతినగర నుంచి మెజెస్టిక్‌కు ప్రయాణించారు. టికెట్టు ధర రూ.29 కావడంతో కండక్టర్‌కు రూ.30 ఇచ్చారు. మిగిలిన రూపాయి ఇవ్వమని అడిగితే కండక్టర్ చిల్లర లేదన్నారు.
మెజిస్టిక్‌లో బస్సు దిగేటప్పుడు కూడా తనకు రావాల్సిన రూపాయి కోసం అడిగితే కండక్టర్ మళ్లీ నిరాకరించారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. దీనిని తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకున్నారు. తనకు ఇవ్వాల్సిన రూపాయి ఇవ్వకపోగా.. కండక్టర్ తన పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించాడని ఆరోపిస్తూ అతడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. నష్టపరిహారం కింద తనకు రూ.15 వేలు ఇప్పించాలని కోరాడు. మూడేళ్ల పాటు వాద, ప్రతివాదనలు విన్న కోర్టు విచారణ పూర్తిచేసి జనవరి 31న తీర్పు వెలువరించింది.
కండక్టర్ బాధ్యతగా వ్యవహరించలేదని భావించిన కోర్టు వినియోగదారునికి పరిహారం కింద రూ.2 వేల అందించాలని ఆదేశించింది. న్యాయ పోరాటానికైన ఖర్చులనూ చెల్లించాలని బీఎంటీసీని ఆదేశించింది. తమ ఆదేశాలను 45 రోజుల్లోగా అమలు చేయాలని.. లేనిపక్షంలో బీఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్‌పై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది. ‘‘ఫిర్యాదుదారు ఈ సమస్యను కమిషన్ ముందు హక్కుగా తీసుకున్నందున వివాదం స్వభావంలో చిన్నవిషయంగా కనిపిస్తోంది.. కానీ, ఇది వినియోగదారుడి హక్కుకు సంబంధించిన అంశంగా గుర్తించి అందుకు అభినందిస్తున్నాం’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.